తాండూరు: తాండూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో నిర్వహించిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజలు తన పర్యటనలో పాల్గొని వారి సమస్యలు వివరించినట్లు తెలిపారు. ఐదు రోజుల పర్యటలో 790 సమస్యలను గర్తించామన్నారు.
శానిటేషన్, వీధి దీపాలు, కల్వర్టులు, సీసీ రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. గుర్తించిన ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన చాలా సమస్యలను అధికారుల సాయంతో తక్షణమే పరిష్కరించామని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పార్టీలకతీతంగా స్థానిక నేతలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాండూరు అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
త్వరలోనే మంత్రి కేటీఆర్ తాండూరులో పర్యటించనున్నట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరం ఎన్నికలతోనే కాలం గడిచిందని.. రెండవ ఏడాది కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిందన్నారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. ఆర్థిక సంక్షోభంలో సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.