తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి తీరుతామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల వరకు రోడ్ల మరమ్మతులు చేపట్టరని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాండూరు పట్టణంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. అభివృద్ధి పనులను చేపట్టేందుకు కొన్ని నియమాలు ఉంటాయని, వచ్చే ఆరు నెలల్లో అన్ని రోడ్లను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.
నన్ను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని, ప్రత్యర్ధులు సృష్టిస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. నన్ను నమ్మిన నా ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయనని భరోసా కల్పించారు. బైపాస్ రోడ్డు పనులు హైదరాబాద్ నుంచి గౌతాపూర్ వరకు నిర్మించాల్సి ఉందని, వచ్చే వర్షాకాలం లోపు ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈ రోడ్డుకు చాలా సార్లు మరమ్మతులు చేశామన్నారు. రోడ్డు పనులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారని, దీంతో తన సొంత డబ్బులతోనే ఈ పనులు చేశామన్నారు.
తాండూరు ప్రజల్లో తానూ ఒకడినని, ప్రభుత్వ సహకారంతో మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించుకుందామన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కు కోసం ఇప్పటికే అధికారులు ఇక్కడ పర్యటించినట్లు తెలిపారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఎంతో అభివృద్ధి చేశానని, ఇంకా మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కాగ్నా వంతెనకు ససమ్య వస్తే పరిష్కారానికి నెల రోజులు పట్టేదని, ఇప్పుడు అధికారులు సహకారంతో కేవలం 24 గంటల్లో సమస్య పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
తాండూరు పట్టణంలో రోడ్లపై దుమ్ము సమస్య అధికంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి రోజూ రెండు మూడు సార్లు రోడ్లపై నీళ్లు చల్లి దుమ్ము సమస్య లేకుండా చూడాలన్నారు. ప్రజలు, ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.