తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలో చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు పట్టణంలోని 18 వార్డుల్లో ఆయన పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మరో మూడు రోజుల పాటు మిగతా 18 వార్డుల్లో పర్యటన కొనసాగనుంది.
మూడు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, పూర్తి స్థాయిలో మార్పుకు కొంత సమయం పడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతుందని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.