తాండూరు: నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గత మూడు రోజులుగా తాండూరు పట్టణంలో పర్యటిస్తున్నారు. మహిళలు, యువతతో కలిసి పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే లాండ్రి షాప్, సెలూన్ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ మీటర్‌లను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రజక, నాయీబ్రాహ్మణులకు లాండ్రీలు, ధోబీఘాట్లు, క్షౌరశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు తెలిపారు.
సెలూన్ షాపులు, లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. దీని వల్ల వారికి శారీరక శ్రమ తగ్గడంతో పాటు ఆర్థిక స్వాలంభన చేకూరుతుందన్నారు. పేదల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. రజక సంఘం అధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.