తాండూరు: గల్లి గల్లికి పైలట్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాత తాండూరు పరిధిలోని 14, 15, 16, 17, 18 వార్డుల్లో పర్యటించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి స్వయంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని.. ఇది ప్రజలపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసే ఏ కార్యక్రమానికైనా సరే ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదన్నారు. వార్డుల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అవసరమైన నిధుల మంజూరు కోసం మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు తెలిపారు.
తాను ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పాత తాండూరులో అర్బన్ హాస్పిటల్ మంజూరు చేయించినట్లు తెలిపారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు సరిగ్గా లేనందునే ఆలస్యం అయ్యిందని, త్వరలోనే బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.