తాండూరు: తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతోనే ప్రజలు వారి సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ప్రజాబంధు మొబైల్ యాప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రజాబంధు యాప్ పనిచేస్తుందన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలంతా ప్రజాబంధు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజలు తమ ఫిర్యాదులను ప్రజాబంధు యాప్ లో నమోదు చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు చేరుతుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజాబంధు ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు.
తాండూరు నియోజకవర్గం ప్రజలు ఎంతో నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి సమస్యలను పరిష్కరించడం తన కర్తవ్యం అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాబంధు యాప్ ఒక సంచలనంగా మారుతుందని, తాను రూపొందించిన ఈ యాప్ పలువురికి మార్గదర్శకంగా మారే అవకాశం ఉందన్నారు. తాండూరు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రజాబంధు చక్కటి పరిష్కారం చూపిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.