తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాలాల మండలం పగిడ్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చీరలను కానుకగా అందిస్తుందని తెలిపారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు చీరలు పంపిణీ చేస్తున్నామని, నియోజకవర్గంలో 92,200 మంది లబ్ధిదారులకు బతుకమ్మ కానుక అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
మహాత్మా గాంధీకి నివాళులు..
నేడు గాంధీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం గాంధీచౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శం అని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలన్నారు. గాంధీ ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పేరుతో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.