తాండూరు: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదివారం తాండూరు పట్టణం బస్వన్న కట్టవద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి గెలిచిన శుభ సందర్భంగా దసరా పండుగ జరుపుకుంటామని తెలిపారు. దుష్ట శక్తుల నుంచి కనకదుర్గమ్మ తల్లి ప్రజలను కాపాడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు కానుకలు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజలంతా సంతోషంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా..
నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. కోత్లాపూర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించి వారికి అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత..
తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. షేక్ అబ్దుల్లాకు రూ.3 లక్షలు, నీతాకు రూ.1 లక్ష విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.