యాలాల: యాలాల మండలంలోని ముద్దాయిపేట, బాగాయిపల్లి, పగిడియాల్, నాగసముందర్, రాఘవాపూర్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో రూ.16 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.14 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
పల్లె ప్రగతి ద్వారా ప్రతినెలా గ్రామాలకు నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని, ప్రాముఖ్యతను బట్టి దశలవారీగా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. నియోజకవర్గం పరిధిలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలోనే నిధులు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.