తాండూరు: రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు యాలాల మండలం బాగాయిపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆక్షేపణీయం అన్నారు. వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెద్దేముల్ మండల కేంద్రంలో..
పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దేముల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు బీజేపీ నిరంకుశ ధోరణి కారణంగా మరోసారి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని, అందుకోసం గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.