తాండూరు: నియోజకవర్గం పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధికారులకు సూచించారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్, రాజీవ్‌కాలనీతో పాటు యాలాల మండలం అన్నాసాగర్ గ్రామంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
అంగన్‌వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.