తాండూరు: తాండూరు పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేపట్టిన ‘గల్లి గల్లికి పైలట్’ కార్యక్రమం మూడవ రోజైన బుధవారం కొనసాగుతోంది. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.
తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కోసం పట్టణంలో తవ్విన గుంతలకు త్వరలోనే మరమ్మతులు చేపడతామన్నారు. పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4, 5, 6, 25 వార్డుల్లో ఈ రోజు పర్యటించనున్నారు.