హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్ 1నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్య, పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది విద్యార్థులు సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలకు హాజరవుతారన్నారు. పాఠశాలలు సజావుగా నడిచేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ఈ విషయంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు.