తాండూరు: పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తుంటే ఉపాధ్యాయుల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ నెల 26 నుంచి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సహా టీచర్లందరూ తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలను కొంతమంది ఉపాధ్యాయులు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. శుక్రవారం సీఈఓ జానకీరెడ్డి పెద్దేముల్ మండలం కందనెల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయురాలు.. ఉన్నత పాఠశాలలో హెచ్ఎం, మరో నలుగురు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. విధులకు గైర్హాజరైన వారందరికీ మెమోలు జారీ చేయాలని డీఈఓ రేణుకదేవి ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు ఐదుగురు, ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈఓ తెలిపారు.