తాండూరు: తాండూరు పట్టణంలో చేపట్టిన పేద ప్రజల కళల సౌదాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న గృహాలు దాదాపు 80 శాతం పనులు పూర్తి చేసుకుని తుది మెరుగులు సంతరించుకుంటున్నాయి.
తాండూరు పట్టణంలో రూ. 50 కోట్ల ఖర్చుతో 1000 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల పట్ల తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లతో తరచూ సమీక్షలు నిర్వహించి పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.