హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతోందని మత్య్స, పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ‍్యర్థిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ విషయం గురించి మంత్రి తలసాని మాట్లాడుతూ.. సామాజిక న్యాయం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ థ్యేయం అని అన్నారు.
ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని హుజురాబాద్ ప్రజలను కోరుతున్నామన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని స‍్పష్టం చేశారు.విపక్షాల మాటలు నమ్మవద్దని మంత్రి తలసాని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల కాలంలోనే 74 ఏళ్ల చరిత్ర తిరగరాశారని కొనియాడారు. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు.