బషీరాబాద్: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం నూతన పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల ముఖచిత్రం పూర్తిగా మారిపోయి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.