తాండూరు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో జిల్లా పరిధిలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 31న వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు.