తాండూరు: నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వారు కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్ల రూపాయల నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతులు తమ పొలాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రజలకు అధికారులకు వారధిగా ఉండేలా ప్రజాబంధు యాప్ రూపొందించామని, ప్రతీ ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు.