యాలాల: గ్రామాల్లో గంజాయి సాగు చేస్తే సాగుదారులతో పాటు వారిని ప్రోత్సహించే వారిని జైలుకు పంపిస్తామని తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులకు ఆయన గంజాయి సాగు, డ్రగ్స్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో కొంత మంది రైతులు అంతర పంటల్లో భాగంగా గంజాయి సాగు చేస్తున్నారని, అలాంటి వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి సాగు చేయడం, వినియోగించడం నేరమన్నారు. ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైందని, ఈ విషయంలో యువకుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు గంజాయి సాగు చేసే వారి వివరాలు పోలీసులకు అందించాలని కోరారు.