బషీరాబాద్: బషీరాబాద్ మండలంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని నవల్గా గ్రామంలో రూ.38.94 లక్షలతో నిర్మించనున్న రెండు తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మండల పరిధిలోని మైల్వార్ గ్రామంలో రూ27.89 లక్షల వ్యయంతో నిర్మించనున్న వాటర్ ట్యాంకు నిర్మాణానికి సైతం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలో బీటీ రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.2 కోట్లతో మైల్వార్-కంసాన్ పల్లి, నవల్గా-మైల్వార్, కాసింపూర్-బాద్లాపూర్-గొటిగాకలాన్, కొర్విచెడ్, పర్వత్ పల్లి గ్రామాల్లో బీటీ రోడ్లకు మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. నవల్గా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని, సమస్య శాశ్వత పరిష్కారం కోసం గ్రామంలో నూతనంగా రెండు ట్యాంకులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ నర్సిమ్ములు నవల్గా గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అనేకమార్లు గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.