తాండూరు: తాండూరు పట్టణం ఎంఐఎం పార్టీకి చెందిన యువ నాయకుడు అబ్రార్ లాలా తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు పాత తాండూరు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పాత తాండూరును పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తామన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.