తాండూరు: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణంలో రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు. తాండూరు పట్టణం ప్రధాన రహదారిలో ర్యాలీ ధూమ్ ధాంగా సాగింది.
అనంతరం రైతుబజార్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయం కోసం 24 గంటల పాటు రైతులకు ఊచిత విద్యుత్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో 22 లక్షలున్న బోరు మోటార్లు ఏడేళ్లలో 8 లక్షలు పెరిగి 30 లక్షలకు చేరుకున్నాయని వివరించారు. ఇంత పెద్ద సంఖ్యలో మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
రైతులు పంట పెట్టుబడులకు ఇబ్బంది పడొద్దని రైతుబంధు ద్వారా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అన్నదాతల శ్రేయస్సు కోసం రైతుబీమా, సాగునీటి వసతి, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలోనూ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.