తాండూరు: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా రూపొందించిన ప్రజాబంధు మొబైల్ యాప్ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ప్రజాబంధు యాప్‌పై అధికారులకు అవగాహన కల్పించారు. ప్రజాబంధు సమన్వయకర్త, సీనియర్ జర్నలిస్ట్ రావి రామ్‌ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
ప్రజాబంధు యాప్ పనితీరు, వినియోగించే విధానంపై ప్రభుత్వ అధికారులకు రామ్‌ప్రసాద్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో మంది వారి సమస్యల పరిష్కారం కోసం తనని కలిసేందుకు వస్తుంటారని, ఇకపై వారి సమస్యలను నేరుగా ప్రజాబంధు యాప్‌లో నమోదు చేస్తే వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు.
ప్రజలు వారి వ్యక్తిగత సమస్యలతో పాటు తమ గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఈ యాప్‌లో నమోదు చేస్తే సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. తాండూరు నియోజకవర్గం పరిధిలో మండలాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేసి కోఆర్డినేటర్లను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా కోఆర్డినేటర్లు నిరంతరం పని చేస్తారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ప్రజాబంధు యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు