తాండూరు: రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు 24గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తుందని చెప్పారు. సాగు నీరు, విత్తనాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలుపై సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. అన్నదాతల సంక్షేమమే తమ ధ్యేయమని, ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చే రైతులు వారి ఆధార్, బ్యాంక్ వివరాలు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రైతుల అకౌంట్ లోనే నగదు జమ చేస్తామన్నారు.