తాండూరు: కలుషిత నీరు తాగడంతో అనారోగ్యానికి గురై తాండూరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాత తాండూరుకు చెందిన బాధితులను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు.
తాగు నీరు కలుషితం అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే పట్టణంలో పర్యటించారు. పైపు లైన్ లీకేజీలే నీటి కాలుష్యానికి కారణమని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.