తాండూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. రూ.26.50 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. రూ.20 కోట్లతో నిర్మించిన మాతాశిశు ఆస్పత్రి, రూ .2.25 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల భవనం, తాండూరులో రూ.3.47 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. పారిశుధ్యం మెరుగుపరచడానికి గాను నూతనంగా తాండూరు మున్సిపాలిటీకి మంజూరైన 18 ట్రాలీ ఆటోలను ప్రారంభించారు. సాయిపూర్ 9వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్తాపన చేశారు. అనంతరం 165 మంది లబ్ధిదారులకు రూ.1.65 కోట్లు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తాండూరులో 100 పడకల ఆస్పత్రిని చూడగానే ఇంద్రారెడ్డి గుర్తుకువచ్చారన్నారు. పాతికేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తాండూరుకు వంద పడకల ఆస్పత్రి తెస్తానని ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కల సాకారం కావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడం ఒకటి మిగిలి ఉందని, భవిష్యత్తులో అది కూడా నెరవేరుతుందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం లేని సమయంలో ఐదు కాలేజీలు మంజూరు చేయించానని ఆమె వెల్లడించారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న కాలంలో తాండూరు నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితారెడ్డి పాత్ర చాలా గొప్పదని, సీఎం కేసీఆర్ సహాకారంతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.