తాండూరు: టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం పెద్దేముల్ మండలం కందెనెల్లి జీపీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో పదవులు పొంది పనిచేయని వారిని తక్షణమే తొలగిస్తామని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఉనికి కోల్పోతున్నాయని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వరంగల్ లో నవంబర్ 15న నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.