తాండూరు: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2020 ఫలితాల్లో తాండూరు యువతి సత్తా చాటింది. నియోజకవర్గం పరిధిలోని బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘన మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా 83వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. దేశ స్థాయిలో ఘనత సాధించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చిందని సాధారణ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు.
బాల్యం, విద్య సాగిందిలా..
మర్పల్లి గ్రామానికి చెందిన రాములు, సుజాత దంపతుల పెద్ద కుమార్తె మేఘన. ఆమె బాల్యం అంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నగరంలోని మదీనాగూడ విజ్ఞాన్ విద్యాలయ పాఠశాలలో 10వ తరగతి, కూకట్‌పల్లి శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్, ఐఐఎం లక్నోలో పీజీ పూర్తి చేసింది.
ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు..
చదువు పూర్తి చేశాక ఐటీసీ లిమిటెడ్ బెంగుళూర్‌లో అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2019లో ఉద్యోగం మానేసి దేశ రాజధాని ఢిల్లీలోని వాజీరాం అండ్ రవి ఇన్‌స్టిట్యూట్‌లో సివిల్స్ కోచింగ్ కోసం చేరింది. 9 నెలల పాటు కోచింగ్ తీసుకున్నాక కరోనా కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఇంట్లోనే ప్రిపరేషన్ కొనసాగించింది. తొలి ప్రయత్నంలోనే దేశ స్థాయిలో 83వ ర్యాంక్ సాధించి ఆందరినీ ఆశ్చర్యపరిచింది మేఘన. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కష్టపడి చదవడం వల్లే తనకు ఈ స్థాయి విజయం దక్కిందని ఆమె చెబుతుంది.