తాండూరు: వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండకు తరలించినట్లు తాండూరు పట్టణ సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు. తాండూరుకు చెందిన అబ్దుల్ రహీం, మహమ్మద్ ఫయాజ్, సయ్యద్ సమీర్, చెంగోల్ బస్తీకి చెందిన ఇంతియాజ్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ బ్యాచ్ గతంలో పట్టణంలోని ఓ షాపు నుంచి మూడు కూలర్లను దొంగిలించారు. పాత తాండూరులో ఉన్న బీసీ హాస్టల్లో ఐదు సిలిండర్లు, 20 కేజీల కందిపప్పు, 17 లీటర్ల వంటనూనెను సైతం ఈ గ్యాంగ్ కాజేసింది. దీంతో పాటు పెద్దేముల్ మండలంలోని గట్టిపల్లి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లను చోరీ చేశారు.