హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని దళితులకు మరో 15 రోజుల్లో రూ.2వేల కోట్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దళితబంధు పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భారతదేశ దళిత ఉద్యమానికి పునాది అవుతుందన్నారు.
నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, మరో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రూ.500 కోట్లు ఇచ్చామని, మరో 15 రోజుల్లో రూ. 2 వేల కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత‍్వ ఉద్యోగం చేస్తున్న దళిత సోదరులకు సైతం దళితబంధు పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు.