తాండూరు: బషీరాబాద్ మండల పరిధిలోని నావంద్గీ సమీపంలో గల కర్నాటక సరిహద్దు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. ఎక్కడో హత్య చేసి శవానికి ఇక్కడ నిప్పంటించినట్లు తెలుస్తోంది. మృతుడికి 35 ఏళ్లు ఉంటాయని.. ఈ ప్రాంతంలో మృతదేహం ఉందని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.
హత్యకు గురైన వ్యక్తి కర్నాటక ప్రాంత వాసి అని, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వెల్లడించారు. హతుడి వివరాల కోసం కర్నాటక పోలీసులకు సైతం సమాచారం ఇచ్చామన్నారు.