తాండూరు: దరఖాస్తు ఫారంతో పాటు అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జత చేయలేదనే కారణంతో మైనార్టీ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పరీక్ష రాసేందుకు పలువురికి అనుమతి నిరాకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అధ్యాపక పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 10 వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో లోకల్ స్థానానికి సంబంధించిన స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్ జత చేయాలని ఉన్నతాధికారులు ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 23వ తేదీన జరిగే నియామక పరీక్షకు జిల్లాలో 153 మంది హాజరవుతారని, అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు జత చేయకపోవడంతో మరో 79మందిని పరీక్షకు అనుమతించడం లేదని మైనార్టీ గురుకుల శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుపతిరెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.